ఎందుకు మోహపు వలను అల్లుకుంటాను పదేపదే..... కనిపించిన వారిని.. కలగనని వారిని ఎదురైతే పలకరిస్తా నెందుకో..
ఎవరికి వివరించాలి ఏమని వివరించాలి... మనిషి మాటలకు అనంత దూరములో రంగురంగుల దారాలు అతి చిక్కగా అల్లుకుని కనిపిస్తున్నాయని...
గజిబిజిగా అల్లుకున్న ఆ దారుల మధ్యన నాకు తెలిసిన ఒక రహదారి నిక్కచ్చిగా నాకు కనిపిస్తుందని... ఎలా చెప్పేది .. ఎంతని చెప్పేది
మనిషికి మనిషికి మధ్యన అడ్డుగోడలే తప్ప పచ్చటి వనాలు కనుమరుగయ్యాయని పదేపదే చెప్పే వారికి నేను ఏమని చెప్పేది...
నాకు నేనుగా మౌనంగా ఉందామని నా రెండు చేతులు మొహంపై కప్పేసుకుని నా కళ్ళను చీకటి గుహల్లో వదిలినప్పుడు... తను ఒక దారి వేసుకుని అనంత దూరం పయనించి సముద్రపు అడుగున ముత్యపు చిప్పలోని ఆణిముత్యాన్ని చూసి వెనక్కు వచ్చినప్పుడు ..నేను ఎవరినో ఎక్కడ ఉన్నానో .. నన్ను నేను ఎవరికి పరిచయం చేసేది ...
గలగల మాట్లాడే మనుషులు హఠాత్తుగా మూగపోతే నే చూసిన రంగుల దారపు వల దారులను కనుగొని మూసేశారు అనుకోనా.. కొత్త దారులు వేయకుండా ఎత్తైన ప్రహరీ గోడలు కట్టడం నేర్చుకున్నారు అనుకోనా... అయినా చెరిగిపోయిన ఆనవాళ్లు ఎక్కడో ఒకచోట భద్రంగా నాకోసం దాచబడి ఉంటాయి...
నాకు నేనుగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక కథగా..కవితగానో మారి నన్ను చేరి... నన్ను నాకు కొత్తగా పరిచయం చేసి ..నాదైన దారిలో కొత్త రంగులు అద్ది నిలబడితే ఇప్పుడు నేను ఏం చేసేది.. నీవు నాతో అల్లుకొని ఉండమని ఆర్థించనా ...మాటగా చెప్పి కనుమరుగైపొమ్మని శాసించనా..
మనుషులు.. మాటలు.. నన్ను చేరిన అక్షరం అన్నీ రంగుల దారపు మోహపు రహదారి అనవాలే నేమో...నన్ను సముద్రపు లోలోతుకు తీసుకెళ్ళి నాకు నన్ను ఓ కొత్త లోకానికి పరిచయం చేస్తూనే ఉంటాయి పదేపదే...
ఎప్పుడూ నా మౌనాన్ని చేదిస్తూనే ఉంటాయి.. ఇక నా నుండి నేను ఎప్పుడూ విడివడలేను ... అందుకే నాతో నిన్ను అతి దగ్గరగా దాచుకుంటాను.. ఏది ఏమైనా నువ్వు నాలోని సగభాగమే కదా.. ఓయ్ ఏమంటావ్...